నెనరులు

ఈ క్రింది వ్యక్తుల, సంస్థల సహాయసహకారాలు (లేదా పరోక్ష కృషి) లేకుంటే లేఖిని లేదు. లేఖిని వారికి నెనరులు తెలుపుతోంది.

  • తెలుగు బ్లాగురుల తొలి సమావేశం, హైదరాబాద్: మార్చి 12, 2006. ఆ సమవేశంలో పాల్గొన్న తెలుగు బ్లాగరులు (చావా కిరణ్, తుమ్మల శిరీష్ కుమార్, ఉప్పల వెంకట రమణ, తదిదరులు), వారి ఉత్సాహం, తెలుగు టైపు చెయ్యడానికి జనాలు పడుతున్న ఇబ్బందులు గురించిన చర్చలు లేఖిని తయారుచేయడానికి ప్రేరణ. ఆ సమావేశం తర్వాత మూడో రోజునే లేఖిని విడుదలయ్యిందంటే, ఆ సమావేశం చూపిన ప్రభావం తక్కువది కాదు.
  • పద్మ అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత, జియోసిటీస్ సైటులో ఉన్న టైపింగు పరికరం, దాన్ని రూపొందించిన/కారణమైన వెన్న నాగార్జున, కన్నెగంటి రామారావు, కొలిచాల సురేశ్ గార్లు. వారి మూల కోడు స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ లైసెన్సు కింద ఉండబట్టి ఆ కోడును చదివి, అర్థం చేసుకొని, తేలికగా వాడుకునేలా మెరుగుపరచి లేఖిని రూపొందించడం సాధ్యమయింది.
  • బొబ్బా కిషన్‌చంద్ అనే మిత్రుడు: లేఖిని తొలి వెర్షనులు అతని కంప్యూటర్ మీదనే తయారుచేసాను మరి.
  • తొలితరం తెలుగు బ్లాగరులు: ఎంతో మంది లేఖినిని ఆదరించారు. అంతేకాదు వారి నోటిమాట ద్వారా లేఖినికి అనూహ్య ప్రచారం కల్పించారు.
  • మొజిల్లా డెవలపర్ నెట్‌వర్క్ వారి డ్యాక్యుమెంటేషన్ తొలిరోజులలో జావాస్క్రిప్ట్ నేర్చుకోడానికి, ఆ తర్వాత లేఖినిలో చేసిన మార్పులకు అవసరమైన సాంకేతికతలు నేర్చుకున్నది చాలామట్టుకు ఈ సైటు నుండే.
  • జారా, ఇంక్‌స్కేప్: లేఖినిలో ఉపయోగించిన గ్రాఫిక్స్, బొమ్మలు వీటి ద్వారానే తయారుచేయబడ్డాయి.
  • కారణి నారాయణరావు, తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం, అట్లూరి అనిల్: 2008లో ఉమ్మడిగా ఓ ఐదేళ్ళపాటు లేఖినిని నడపటానికి అవసరమైన నిధులు విరాళాల రూపంలో అందించినందుకు.
  • అపూర్వ ఫాంట్స్: అందమైన జిమ్స్ ఖతి ఉచితంగా అందిస్తూన్నందుకు. వివిధ కంప్యూటర్ నివ్యలలో వచ్చే అప్రమేయ ఖతులు ఏమీ బాగలేవు. కనుక ఈ జిమ్స్ ఖతిని జాల ఖతిగా లేఖిని వాడుతుంది. కనీసం లేఖినిలో మీరు వ్రాస్తున్నది మీకైనా కాస్త చక్కగా కనిపిస్తుంది.
  • లేఖినిని ఆదరిస్తూన్న వాడుకరులు, అభిమానులు: ఇన్నేండ్ల నుండి లేఖినినే (దానికి ఉన్న ఇబ్బందులను భరిస్తూనే) వాడుతున్న మీరు లేఖినిలో కొత్త సౌలభ్యాలను చేర్చడానికి ఒక ప్రేరణ.

2022 మార్చి 15

🡠 తిరిగి మొదటి పేజీకి